Tuesday, July 19, 2011

ప్రప్రథమ స్వాతంత్ర్య సమర యోధుడు

 సుమారు రెండుశతాబ్దాలు మన దేశాన్ని తమ గుప్పెట్లో పెట్టుకుని పరిపాలించిన బ్రిటిష్  వారిపై యుద్ధాన్ని ప్రకటించిన తొలి స్వాతంత్ర్య సమర యోధుడు మంగళ్ పాండే.
అప్పటివరకూ బ్రిటిష్ వారి పెత్తనానికి తలవొగ్గి వాళ్ళు చేస్తున్న అరాచకాలు, అవమానాలు మౌనంగా భరించిన భారతీయుల ఆలోచనలను స్వేచ్ఛా స్వాతంత్ర్యాల సాధన వైపు మళ్లించిన ఘనత మంగళ్ పాండేదే ! 

ఉత్తరప్రదేశ్ లో పుట్టిన  మంగళ్ పాండే తన 22 వ యేట బెంగాల్ ప్రాంత బ్రిటిష్ సైన్యంలో చేరాడు. అక్కడ బ్రిటిష్ అధికారుల ప్రవర్తన, వారు చేసే అవమానాలు అతన్ని ఆలోచింపజేశాయి. అప్పట్లో ఆ సైన్యంలో నూటికి తొంభై మంది భారతీయులే వుండేవారు. అందులోనూ హిందువులు, ముస్లిములూ. ఇప్పటిలాగా అప్పట్లో హిందూ ముస్లిం బేధభావాలు లేవు. హిందువులు, ముస్లిములు భారతీయులు..... అంతే ! అందరూ కలసి మెలసి వుండేవారు.

మంగళ్ పాండే పనిచేస్తున్న 34 వ బెంగాల్ బెటాలియన్ కు కమాండర్ గా  పనిచేస్తున్న బ్రిటిష్ అధికారి క్రిస్టియన్ మత బోధకుడు కూడా ! అధికారులు సిపాయిలకు వాడే రైఫిల్ లో వుపయోగించడానికి గొట్టం లాంటివి ఇచ్చేవారు. దాని మూతను సిపాయిలు నోటితో కొరికి తీసి రైఫిల్ లో పెట్టాల్సి వచ్చేది. అది కొరికేటపుడు ఆ సిపాయిల్లో అనుమానం తలెత్తింది. నెమ్మదిగా ఆ అనుమానం బలపడింది. ఇంతకీ ఆ అనుమానం...  ఆ తూటాల గొట్టాలను ఆవు తోలుతో చేయిస్తున్నారని , దానిపైన పంది కొవ్వు పూస్తున్నారని. ఆవు హిందువులకు పరమ పవిత్రమైనది, పూజనీయమైనది. ఆవు తోలును నోటితో కొరకాల్సి రావడం ఆ సైన్యంలోని హిందువులను బాధించింది. అలాగే పంది అంటే ముస్లిములకు ఏహ్యభావం. అందుకని వారికి ఆ తూటాలను నోటిలో పెట్టుకోవాల్సిరావడం ఇబ్బంది కలిగించింది. మొత్తానికి సిపాయిలందరూ ఈ విషయంలో చాలా అసహనంగా వున్నారు. తమ కమాండర్ భారతీయులను అవమానించడానికి కావాలనే ఈ ఏర్పాటు చేశాడనే నిశ్చయానికి వచ్చారు.

కలకత్తా దగ్గరలోని బారక్ పూర్ లో 1857 మార్చ్ 29 న మంగళ్ పాండే సార్జెంట్ పైన, అతని సహాయకుడి పైన దాడి చేసి గాయపరిచాడు. తోటి సైనికులు అడ్డుకోకపోతే ఇద్దర్నీ హతమార్చేవాడే ! దాంతో బ్రిటిష్ ప్రభుత్వం అతన్ని అరెస్ట్ చేసింది. మరణశిక్ష విధించింది. తెల్లవారి చేతుల్లో చావడం ఇష్టం లేని మంగళ్ పాండే ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు. కానీ విఫలం అయింది. చివరకు మంగళ్ పాండేని ఉరి తీశారు.

భారతీయుల దాస్య విముక్తికి నాంది పలికిన పోరాటంగా, ముఖ్యంగా సిపాయిల తిరుగుబాటుగా పిలిచే మంగళ్ పాండే చేసిన ఆ పోరాటం ప్రథమ భారత స్వాతంత్ర్య పోరాటానికి ప్రారంభంగా చరిత్రలో నిలిచిపోయింది. ఆ తర్వాత ఎందరో త్యాగధనులు తమ ధన, మాన, ప్రాణాలను తృణ ప్రాయంగా భావించి సుమారు తొమ్మిది దశాబ్దాలు చేసిన పోరాట ఫలితమే నేటి స్వేచ్ఛా భారతం.

 ఈ రోజు ప్రప్రథమ స్వాతంత్ర్య సమర యోధుడు మంగళ్ పాండే జయంతి.  ఆ సందర్భంగా ఆయనకు నివాళులు ఆర్పిస్తూ .....


Vol. No. 02 Pub. No. 284

No comments:

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం