Sunday, July 3, 2011

విశిష్ట నట యశస్వి

తొలి చిత్రం ' వరూధిని '. 
తొలి షాట్ కథానాయికతోనే ! 
....... అదీ శృంగార సన్నివేశం. నాటకానుభవం వున్నా స్త్రీ పాత్రలు ధరించిన పురుషులతోనే నటించిన అనుభవం. ఇప్పుడు నాయిక పాత్ర ధరించిన ఒక స్త్రీతో శృంగార సన్నివేశమంటే బెరుకు, సిగ్గు. దాంతో దర్శకులు రామనాథం గారి చేత ' ఆమె వంక చూసి డైలాగ్ చెప్పవయ్యా ! ఎక్కడో పాతాళంలోకి చూసి మాట్లాడతావేంటి ? ' అని చివాట్లు తిన్న నటుడు ఎస్. వి. రంగారావు. ఆ చిత్రం ప్లాప్ అయింది . రంగారావు గారు నిరాశపడి వాళ్ళ వూరు వెళ్లిపోయారు. 

రెండేళ్ళ తర్వాత బి. ఏ. సుబ్బారావు గారు తన ' పల్లెటూరి పిల్ల ' చిత్రంలో కంపన దొర వేషం ఇస్తాను రమ్మని కబురు చేసారు. రంగారావు కొంచెం ఆలస్యంగా మద్రాస్ చేరడంతో ఆ వేషం దక్కలేదు. నిరాశపరచడం ఇష్టం లేక సుబ్బారావు గారు చిన్న వేషం ఇచ్చారు. ' ద్రోహి ' చిత్రంలో ప్రతినాయకుడి వేషానికి అనుకున్నారు గానీ చివరకు ఆ వేషం వేరొకరికి వెళ్ళిపోయింది. ఎల్. వి. ప్రసాద్ గారిని ' మనదేశం' చిత్రంలో వేషం కోసం కలిసినా అప్పటికే అన్ని ప్రధాన పాత్రలకు పాత్రధారులను నిర్ణయించెయ్యడంతో ఓ చిన్న వేషంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ' నిర్దోషి ' చిత్రంలో రంగారావు గారికి సరిపోతుందనుకున్న వేషంకోసం హెచ్. ఎం. రెడ్డి గారితో ఎల్. వి. ప్రసాద్ గారు ప్రత్యేకంగా చెప్పినా అప్పటికే ముక్కామల గారిని నిర్ణయించడంతో ఆ అవకాశమూ తప్పిపోయింది. 
ఇన్ని అవకాశాలు చెయ్యిజారిపోయినా పట్టుదలతో ప్రయత్నించగా విజయావారి ' షావుకారు ' చిత్రంలో సున్నం రంగడి పాత్ర లభించింది. ఆ పాత్రతో రంగారావు గారి దశ తిరిగింది. తెలుగు చలన చిత్ర రంగానికి మరో మహానటుడు లభించాడు.... ఆ తర్వాత నేపాళ మాంత్రికుడిగా ఆవతరించి, ఘటోత్కచునిగా సాక్షాత్కరించి, దుర్యోధనునిగా, కీచకునిగా, యమునిగా ఇంకా అనేక పౌరాణిక పాత్రలు, కత్తుల రత్తయ్య, బందిపోటు భీమన్నలాంటి పాత్రలు, అన్న, తండ్రి లాంటి అన్నిరకాల పాత్రలు ధరిస్తూ సుమారు పాతికేళ్ళు తెలుగు తెరను ఏకచత్రాదిపత్యంగా ఏలాడు. 

ఆ విశ్వనట చక్రవర్తి జన్మదినం సందర్భంగా నివాళులు అర్పిస్తూ..........

యశస్వీ రంగారావు గారి గురించి గతంలోని టపాలు ......




Vol. No. 02 Pub. No. 270

No comments:

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం