Wednesday, June 1, 2011

ఎదురులేని అధ్యక్షుడు

ఇప్పటివరకూ మన దేశానికి అధ్యక్షులుగా పనిచేసిన, చేస్తున్న పన్నెండు మందిలో ముగ్గురు తెలుగు వారు కావడం విశేషం. వారిలో మూడవవారు, అధ్యక్షుల్లో ఆరవవారు అయిన నీలం సంజీవరెడ్డి గారికి కొన్ని ప్రత్యేకతలున్నాయి. 

గాంధీజీ ప్రభావంతో చదువును త్యాగం చేసి 1931 లో స్వాతంత్ర్యోద్యమంలోకి దూకారు. 1946 లో మద్రాసు శాసనసభకు ఎన్నికయ్యారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత రాజ్యాంగ రచనా సంఘంలో సభ్యుడిగా పనిచేసారు. 

1956 లో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి గా పనిచేసిన ఘనత ఆయనది . అంతేకాదు రెండోసారి కూడా 1962 నుంచి 64 వరకూ ముఖ్యమంత్రిగా పనిచేసారు. భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షునిగా పనిచేసారు.

ఉమ్మడి మద్రాసు  రాష్ట్రంతో బాటు కేంద్రంలో కూడా సంజీవరెడ్డి గారు మంత్రిగా పనిచేసారు. 1967 లో లోక్ సభ స్పీకర్ గా ఎన్నికై అందరి ఆదరాభిమానాలు చూరగొన్నారు. పార్లమెంట్ చరిత్రలో స్పీకర్ గా ఎన్నికయ్యాక పక్షపాతరహితుడిగా ఉండడానికి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన ఘనత సంజీవరెడ్డి గారిదే !

1969 లో అప్పటి దేశాధ్యక్షులు డా. జాకీర్ హుస్సేన్ మరణం తర్వాత కాంగ్రెస్ అభ్యర్థిగా సంజీవరెడ్డిని ప్రకటించినా సొంత నిర్ణయాలు తీసుకునే ఆయన ధోరణి నచ్చక ఇందిరాగాంధీ చేసిన రాజకీయంతో ఆయన ఓడిపోయారు. దానితో క్రియాశీల రాజకీయాలనుంచి తప్పుకున్నారు. 

1975 లో జయప్రకాశ్ నారాయణ్ ప్రభావంతో జనతాపార్టీలో చేరడంతో మళ్ళీ రాజకీయ రంగ ప్రవేశం చేసారు. 1977 లో నంద్యాల పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసి, ఆంధ్రప్రదేశ్ నుండి ఎన్నికైన ఏకైక కాంగ్రెసేతర అభ్యర్థిగా రికార్డు సృష్టించారు.
లోక్ సభ స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నికై ఉత్తమ స్పీకర్ గా అందరి మన్ననలూ పొందారు.

అదే సంవత్సరం ఏకగ్రీవంగా దేశాధ్యక్షునిగా ఎన్నుకోబడిన ఏకైక వ్యక్తిగా చరిత్రలో నిలిచారు. అంతేకాదు అప్పటివరకూ రాష్ట్రపతి పదవికి వున్న " రబ్బర్ స్టాంప్ " ముద్రను పోగొట్టిన ఏకైక రాష్ట్రపతి కూడా నీలం సంజీవరెడ్డే !

అనంతపురం జిల్లా ఇల్లూరు గ్రామంలో జన్మించిన నీలం సంజీవరెడ్డి గారు 1996 జూన్  ఒకటవ తేదీన దివంగతులయ్యారు. 

ఈరోజు సంజీవరెడ్డి గారి వర్థంతి సందర్భంగా స్మరించుకుంటూ........


Vol. No. 02 Pub. No. 245

No comments:

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం